రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

సమస్యలు విన్నవిస్తూ సీఎంకు లేఖలు

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక ఒకసారి మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందించి వరుసగా మూడు సీజన్లు మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని.. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్‌ నేతల్లో విశ్వసనీయత కొరవడిందన్నారు. నియోజకవర్గంలో పాలకులు, అధికారులు ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. పోలీసులు కూడా నాయకుల కొమ్ముకాస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ సునీతరెడ్డికి స్వయంగా కలిసి వివరించామని చెప్పారు.

భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాకేంద్రంలో వైద్య, నర్సింగ్‌ కళాశాల, ఆస్పత్రి కోసం 50 ఎకరాలు కేటాయిస్తే.. అందులో యంగ్‌ ఇండియా స్కూల్‌ నిర్మాణం చేసేందుకు సన్నాహాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దూరదృష్టితో రింగ్‌ రోడ్‌ ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగా పనులు నిలిపివేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్యకేసును పోలీసులు ఎందుకు ఛేదించడం లేదని.. ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. పెబ్బేరు సంత స్థల వివాదాన్ని నెలరోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదన్నారు. యంగ్‌ ఇండియా స్కూల్‌ నిర్మాణం, పెబ్బేరు సంత స్థల వివాదాల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ చేపడితే.. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. రామన్నగట్టు రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి నేటికీ పనులు ప్రారంభించలేదని, కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే డీ–5, డీ–8 కాల్వలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో గద్వాల, వనపర్తికి కలిపి ఇక్కడే సీఈ కార్యాలయం ఏర్పాటు చేశామని.. కనీసం అధికారులు వస్తున్నారా లేదా అనే విషయాన్ని సైతం పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్‌, నాయకులు నందిమళ్ల అశోక్‌, లక్ష్మారెడ్డి, ,రఘుపతిరెడ్డి, భీమన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement