వనపర్తి: జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఐదేళ్లు ఆలస్యంగా ప్రారంభమైంది. జనాభా లెక్కల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసే అవకాశాలు ఉంటాయి. భారత ప్రభుత్వం ఈ ప్రక్రియను తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో రెండువిడతల్లో నిర్వహించనుంది. తొలివిడతలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఇళ్లు, కుటుంబాలను గుర్తిస్తారు. అనంతరం గుర్తించిన ఇళ్లలో కుటుంబాల సంఖ్య ఆధారంగా బ్లాక్‌లుగా విభజించి జనాభా లెక్కలను సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మే 11 నుంచి క్షేత్రస్థాయిలోకి..
తొలివిడత మే నెల 11 నుంచి జూన్ 9 వరకు 30 రోజుల పాటు ఇళ్లు, కుటుంబాలు, జీవన స్థితిగతుల వివరాల సేకరణకు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఇళ్లు, కుటుంబాలతో పాటు మరో 34 అంశాలను సేకరించి సీఎంఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.
మూడురోజుల పాటు శిక్షణ..
మండలాల వారీగా సెన్సెస్ అధికారులు, క్లర్క్‌లుగా నియమించిన 60 మంది అధికారులు, సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభం కాగా.. కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై జనాభా లెక్కల ప్రక్రియపై కీలక సూచనలు చేశారు.
15 ఏళ్ల తర్వాత నిర్వహణ.. పూర్తిగా డిజిటల్ విధానంలో...
జిల్లాలో రెండు విడతల్లో వివరాల సేకరణ
తొలి విడత ఇళ్లు, కుటుంబాలు
మలి విడతలో జనగణనకు కసరత్తు
ప్రారంభమైన ఎన్యూమరేటర్ల శిక్షణ
బాధ్యతగా పనిచేయాలి
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే జనగణన ప్రక్రియలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియల్లో నిబంధనలపై అవగాహన కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – ఆదర్శ్ సురభి, కలెక్టర్


