వనపర్తి రూరల్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, గ్రామస్తులు, యువతతో కలిసి రహదారులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి బాటలో నడిచినప్పుడే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుంటుందని తెలిపారు. వేసవిలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామంలోని రోడ్లు, పాఠశాల, దేవాలయ ఆవరణలు, వార్డులను శుభ్రం చేసిన విద్యార్థులను అభినందించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులు శిరీష బాలకృష్ణకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్ సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారి కల నెరవేస్తుందన్నారు. సర్పంచ్ పుష్పలత శివకుమార్, సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ సర్పంచ్ కొండన్న, నాయకులు శేఖర్‌రెడ్డి, రొయ్యల రమేష్, విష్ణువర్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉండాల రాముడు, శివయ్య పాల్గొన్నారు.


