వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. చివరిరోజు రెండో సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 5,555 మంది విద్యార్థులకుగాను 5,389 మంది విద్యార్థులు హాజరుకాగా.. 166 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,705 మందికిగాను 4,590 మంది హాజరుకాగా.. 115 మంది పరీక్ష రాయలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 850 మందికిగాను 799 పరీక్ష రాయగా.. 51 మంది గైర్హాజరయ్యారు. డీఐఈఓ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను తనిఖీ చేస్తున్న తీరును పరిశీలించారు. స్కాలర్స్, విజ్ఞాన్, జాగృతి, వాగ్దేవి, సీవీ రామన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.


