సమస్యల పరిష్కారమే లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం..

Mar 13 2026 9:01 AM | Updated on Mar 13 2026 9:01 AM

సర్పంచ్‌లు, కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలి

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి

జూపల్లి కృష్ణారావు

వనపర్తి: సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి వారి మెప్పు పొందాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కళ్యాణసాయి గార్డెనన్స్‌లో ’ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎన్నికై న సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతరెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా రోజు ఉదయం 2 గంటల పాటు 20 నుంచి 30 ఇళ్లను సందర్శించి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. రాబోయే రోజుల్లో నిర్వహించే గ్రామసభల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణమాఫీ, రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్‌, గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. అధికారులు కూడా ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా నమోదు చేయాలని.. ఏ ఒక్క దరఖాస్తు కూడా 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశించారు. అధికారులు జవాబుదారీగా పని చేయాలని కోరారు.

స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలి..

ప్రజాప్రతినిధులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తమ కార్యాలయాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గ్రామాలు, వార్డుల్లో నీరు, విద్యుత్‌ వృథాను అరికట్టాలని కోరారు. తమ పరిధిలోని పాఠశాలలు, ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాను అన్నిరంగాల్లో ముందువరుసలో నిలపాలని కోరారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఏప్రిల్‌లో నిర్వహించే గ్రామసభల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల బంధం దృఢంగా ఉండేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. సమావేశంలో వనపర్తి మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్‌, అమరచింత పుర చైర్‌పర్సన్లు మాధవి, అరుణ, శ్రీనివాస్‌గౌడ్‌, నాగమణి, జింక సువర్ణ, సర్పంచులు, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement