● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి టౌన్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టులో సాగు చేసిన వరి పంటలకు సరిపడా నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారని.. ఇందుకు కారణం సాగునీటిశాఖ అధికారులేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌పార్టీ పట్టణ, మండల కార్యవర్గాల ఎన్నిక కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరద నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లకు తరలించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇటీవల అధికారుల సమీక్షలో కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసినట్లు అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అధికారులను హెచ్చరించారు. కాంగ్రెస్‌పార్టీలో నిబద్ధతగల నాయకులకు గుర్తింపు ఉంటుందని.. అందుకు ఉదాహరణ డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి ఎన్నిక అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పనితీరు బాగుందని.. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారని, ప్రజలకు చేరువవుతున్నారని కొనియాడారు. తనకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజావాణి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి గుర్తింపు, గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ గ్రామ, మండల, పట్టణ కమిటీల్లో నిబద్దతగల కార్యకర్తలకే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పేదలందరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్‌తో సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజల్లో మంచిపేరు వచ్చిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కార్యకర్తల కోసం తాము పని చేస్తామని.. ఎప్పుడు ఫోన్‌చేసినా అందుబాటులో ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పార్టీ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.


