కానాయపల్లి పునరావాస కేంద్రం పరిశీలన..
వనపర్తి: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ, ఇతర పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పునరావాస పనుల పురోగతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గణప సముద్రం రిజర్వాయర్‌కు సంబంధించి 197 ఎకరాల ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కర్నె తండా ఎత్తిపోతలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 26 ఎకరాల భూ సేకరణకు పెగ్ మార్కింగ్ 14వ తేదీలోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద డీ–1, డీ–5, డీ–8, ప్యాకేజీ 29కు సంబంధించి 92 ఎకరాల భూ సేకరణకు పెగ్ మార్కింగ్ వారంలోగా పూర్తి చేయాలన్నారు. ఖిల్లాఘనపురం బ్రాంచ్ కాల్వ నిర్మాణానికి మార్కింగ్ పూర్తయిన 31 ఎకరాల ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తి చేయాలని సర్వేశాఖ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొత్తకోట మండలం కానాయిపల్లి ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌తో పాటు శంకరసముద్రాన్ని సందర్శించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ నాగేందర్, ఎస్‌ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.
కొత్తకోట రూరల్: శంకరసముద్రం ముంపు గ్రామమైన కానాయపల్లి పునరావ కేంద్రాన్ని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు గురువారం సందర్శించారు. మొదట బండ్ లోపల ఉన్న ఇళ్లను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పునరావాస కేంద్రంలోని రోడ్లు, ప్లాట్లను పరిశీలించారు. గ్రామస్తులు సమస్యలను కమిషనర్‌కు విన్నవించగా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సమాధానమిచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ చాంద్‌పాషా, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, గ్రామస్తులు జితేందర్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, భీమన్ననాయుడు, గోకరయ్య, నాగరాజు, బాలరాజు, శ్రీనివాసులు ఉన్నారు.


