పాన్‌గల్: పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పశువులకు టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చింతకుంట, రాయినిపల్లిలో పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. సురేష్, చింతకుంట సర్పంచ్ కోట్ల రాములు, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కార్మికుల వేతనాలు
పెంచాలి
ఆత్మకూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ కోరారు. గురువారం స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ వద్ద కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక ఆస్పత్రిని 23 నుంచి 30 పడకలకు పెంచాలని గతంలో డిమాండ్ చేయగా.. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ఉత్తర్వులు వెలువరించారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, మెడికల్ కార్మికులు ఏళ్ల తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వేతనాల్లో కోత విధిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీని వెంటనే రద్దు చేసి జీఓ ప్రకారం వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్తార్, బాలరాజు, శ్రీకాంత్, అరుణ్, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్
ఫస్టియర్ జనరల్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరిరోజు రసాయనశాస్త్రం, కామర్స్ పరీక్షలు జరగగా 6,503 మంది విద్యార్థులకుగాను 6,222 మంది హాజరుకాగా.. 281 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,491 మందికిగాను 5,283 మంది పరీక్ష రాయగా.. 208 మంది హాజరుకాలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,012 మందికిగాను 939 మంది హాజరుకాగా.. 73 మంది రాయలేదు. డీఐఈఓ ఎర్ర అంజయ్య జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల, ఉర్దూ మీడియం, రావూస్, అభ్యాస్, త్రివేణి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే డీఈసీ బృందం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత, శ్రీప్రతిభ, ఆత్మకూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికాస్, వనపర్తిలోని విజ్ఞాన్, స్కాలర్స్, సూర్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోపాల్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి, వాగ్దేవి, సీవీ రామన్, జాగృతి కళాశాల పరీక్ష కేంద్రాలను.. సిట్టింగ్ స్క్వాడ్ బృందం కొత్తకోట, గోపాల్ పేట, వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించింది.


