పకడ్బందీగా పది పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పది పరీక్షలు

Mar 12 2026 8:57 AM | Updated on Mar 12 2026 8:57 AM

375 మంది ఇన్విజిలేటర్లు..

హాల్‌టికెట్‌ లేకున్నా పరీక్షకు అనుమతి

పది పరీక్షల నిర్వహణకుగాను ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 375 మంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే సీఎస్‌ 37 మంది, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు 37 మందిని నియమించాం. కొన్ని గదుల్లో విద్యార్థుల సంఖ్య కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ఎదుటే తెరిచేలా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

వనపర్తిటౌన్‌: పదోతరగతి విద్యార్థులు హాల్‌టికెట్‌ లేకపోయినా వార్షిక పరీక్షలు రాయవచ్చని.. అటెండెనన్స్‌ షీట్‌ ఆధారంగా కేంద్రాల్లోకి అనుమతిస్తామని జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ తెలిపారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల అటెండెన్స్‌ షీట్స్‌ ఉంటాయని.. హాల్‌టికెట్స్‌ లేవని ఆందోళన చెందవద్దన్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, సిబ్బంది తదితర విషయాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

ఆందోళనకు గురికావద్దు..

విద్యార్థులు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి పదోతరగతి పరీక్షలను వచ్చే నెల 16 వరకు నిర్వహిస్తోంది. ప్రతి పరీక్షకు మధ్య ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని సబ్జెక్టుపై మరింత పట్టు సాధిస్తే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడయ్యే అవకాశం ఉంది. వివిధ కారణాలతో హాల్‌టికెట్‌ పొందని విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్‌టికెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్‌ వస్తుంది.. దీంతో విద్యార్థులు సులువుగా కేంద్రాలకు చేరుకోవచ్చు. విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించాం. వారుకూడా సానుకూలంగా స్పందించారు. అనివార్య కారణాలతో విద్యార్థులు పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతిస్తాం. కేంద్రాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, బెంచీలు, విద్యుత్‌ సౌకర్యం సరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ, పోలీస్‌శాఖ సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పరీక్షల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల సమక్షంలోనే తెరుస్తాం. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక వైద్యసేవలు అందించేందుకు కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. జిల్లావ్యాప్తంగా ప్రశ్నపత్రాల స్టోరేజ్‌ పాయింట్లు (పోలీస్‌స్టేషన్లు) 10 ఏర్పాటు చేశాం.

7,212 మంది విద్యార్థులు..

జిల్లావ్యాప్తంగా 7,212 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3,577 మంది బాలురు.. 3,635 మంది బాలికలు ఉన్నారు. మొత్తం రెగ్యులర్‌ విద్యార్థులే కాగా.. ప్రైవేట్‌ విద్యార్థులు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిజికల్‌ సైన్స్‌, బయోలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మాత్రమే జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 25, ప్రైవేట్‌ పాఠశాలలు 12 ఉన్నాయి.

క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో కేంద్రం గుర్తింపు

ప్రతి కేంద్రంలో విద్యార్థులకు కనీస

వసతుల కల్పన

ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement