గోపాల్‌పేట: ప్రతి కార్యకర్త శ్రమించి కాంగ్రెస్‌పార్టీ విజయానికి కృషి చేశారని.. వారికి పార్టీ అండగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో మండల కాంగ్రెస్ కమిటీల ఎన్నికకు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొని ఆయా మండలాల కార్యకర్తలతో అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, పోలీసు కేసులతో వేధించినా పార్టీ కోసం పని చేశామని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసినా ఫలితం లేదని.. కనీసం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేర్లు లేకుండా చేశారని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మండల అధ్యక్షులతో పాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓబీసీ, ఇందిరమ్మ కమిటీలు, పీసీసీ ఇలా ఎన్నో కమిటీలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరికి ఏదోవిధంగా ప్రయోజనం కలిగేలా చూస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికి అధ్యక్షుడి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మూడు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


