●
మదనాపురం: జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగించే గాలికుంటు మహమ్మారిని తరిమికొట్టేందుకు పశుసంవర్ధకశాఖ సర్వం సిద్ధంమైంది. మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9 వరకు నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి పశువుకు టీకా వేయాలని యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
జిల్లాలోని 15 మండలాల్లో పశుసంపదను కాపాడేందుకు అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 1,10,935 పశువులకు టీకాలు వేయనున్నారు. ఇందుకోసం 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ టీకా బృందాలు షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామాన్ని సందర్శించి.. 6 నెలల వయసు పైబడిన ప్రతి పశువుకు టీకా వేయనున్నారు. తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ కల్పించవచ్చు.
అశ్రద్ధ చేస్తే ఆర్థికంగా నష్టం..
గాలికుంటు వ్యాధి కేవలం ఒక అనారోగ్యం మాత్రమే కాదు. అది రైతు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. గాలి, నీరు, కలుషిత మేత ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. నోరు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి.. పశువు మేత మేయలేక నీరసించి ప్రాణాలు కోల్పోయ్యే ప్రమాదం ఉంది.
నేటి నుంచి గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం
జిల్లాలో 1.10 లక్షల పశువులు
28 ప్రత్యేక బృందాలతో రంగంలోకి పశుసంవర్ధకశాఖ


