వనపర్తి: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా అధికారులను ఆయన శాలువాలతో సన్మానించి మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో మ హిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తోందని.. వాటిని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో మహిళా అధికారులు ము ఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఏఓ భానుప్రకాశ్ పాల్గొన్నారు.
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
వివిధ సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను అధికారులు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి.. వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అందరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో 35 అర్జీలు అందాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు.


