వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వేద మంత్రోచ్ఛారణలతో స్వామివారికి చతుస్థానార్చన అనంతరం మోహినిగా అలంకరించి.. గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీరంగనాథుడు దివ్యతేజ స్వరూపుడై తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టు స్వామి, గోవిందాచార్యులు, కన్నయ్యస్వామి పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు
255 మంది గైర్హాజరు
వనపర్తిటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 255 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 25 కేంద్రాల్లో 7,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 6,903 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,852 మందికి గాను 5,643 మంది, ఒకేషనల్‌లో 1,301 మందికి గాను 1,260 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, ఆత్మకూర్, గోపాల్‌పేట కళాశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
ఖిల్లాఘనపురం: మండలంలోని దొంతికుంటతండా స్టేజీ వద్ద ఉన్న తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి, 7 నుంచి 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తు గడువును పొడిగించినట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా htt p://tgms.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏప్రిల్ 19న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల్లో సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
వేరుశనగ క్వింటా రూ.10,080
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా 10,080, కనిష్టంగా రూ.4,500 ధరలు లబించాయి. కందులు గరిష్టంగా రూ.7,389, కనిష్టంగా రూ.5,501, మినుములు గరిష్టంగా రూ.7,959, కనిష్టంగా రూ.7,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,621,పెబ్బర్లు రూ.5,051 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు రూ.5,809, రాగులు క్వింటా రూ.3589గా ఒకే ధర నమోదైయింది. హోలీ సందర్భంగా దేవరకద్ర మార్కెట్‌కు మంగళవారం సెలవు ప్రకటించారు.


