● బాలల సంరక్షణకు వందరోజుల కార్యాచరణ
● ప్రారంభమైన చైల్డ్ హెల్త్–100 ప్రోగ్రామ్
● జిల్లాలోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
వనపర్తి: చిన్నారుల మరణాలు తగ్గించడం.. వ్యాధుల నియంత్రణ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ‘చైల్డ్ హెల్త్–100’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి జూన్ మొదటి వారం వరకు వంద రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించడం.. వారిలో ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి.. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. రానున్న రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి చిన్నారుల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలను తెలుసుకొని.. వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపట్టనుంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, 14–15 ఏళ్ల వయసు గల విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా భవిష్యత్‌లో కేన్సర్‌ను నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ప్రతి విద్యార్థినికి అందించే కార్యక్రమం సైతం ‘చైల్డ్ హెల్త్–100శ్రీలో చేపట్టనున్నట్లు తెలిసింది.
ప్రాథమిక దశలోనే చికిత్స..
విద్యార్థుల్లో పోషకాహార లోపాలు, దృష్టి తీక్షణత తెలుసుకునేందుకు రక్తహీనత, హెచ్‌బీ తదితర పరీక్షలు చేస్తారు. జన్యుపరమైన లోపాలు, ఇతర వ్యాధులు, వైకల్యం తదితర సమస్యలను గుర్తించి.. వాటి నివారణ కోసం పోషకాలు, వైద్యాన్ని ప్రాథమిక దశలోనే అందించేందుకు చైల్డ్ హెల్త్ –100 కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్–100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. వంద రోజుల్లో నాలుగు దశల్లో కార్యక్రమాన్ని పుర్తిచేస్తాం.
– డా.సాయినాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ


