వనపర్తి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని మరోసారి నిరూపితమైంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి సోమవారం హాజరైన రాహుల్ గాంధీని డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. గత ప్రభుత్వ హయాంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఢిల్లీలో ధరల నియంత్రణపై చేపట్టిన ధర్నాలో ఆయన కాలుకు గాయమైతే.. రాహుల్ గాంధీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు శివసేనారెడ్డి కుటుంబ సభ్యుల ను కలిసి తానున్నానంటూ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పడిన అనుబంధంతో ప్రస్తుతం ఆయన శివసేనారెడ్డి కుటుంబ సభ్యులను కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, రాష్ట్రంలో శాట్ తరఫున చేపడుతున్న క్రీడలు.. జిల్లా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు శివసేనారెడ్డి తెలిపారు. పా ర్టీని బూత్ లెవల్‌లో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.


