వనపర్తి రూరల్: మహిళల భాగస్వామ్యంతోనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వి.రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో సోమవారం వనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడంలో మహిళా ప్రజాప్రతినిధులు ముఖ్యభూమిక పోషించాలని సూచించారు. మహిళా చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమన్నారు. ఈ విషయంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రబాబు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు పాల్గొన్నారు.


