వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జరిగిన పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 5,844 మంది విద్యార్థులకుగాను 5,591 మంది హాజరుకాగా.. 153 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,821 మందికిగాను 4,602 మంది హాజరుకాగా.. 119 మంది రాయలేదని చెప్పారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,023 మందికిగాను 989 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 34 మంది హాజరుకాలేదు. జిల్లాకేంద్రంలోని జాగృతి, విజ్ఞాన్, స్కాలర్స్, అభ్యాస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, సీవీ రామన్ కళాశాల కేంద్రాల్లో విద్యార్థుల తనిఖీని పరిశీలించినట్లు వివరించారు. డీఈసీ బృందం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, స్కాలర్స్, త్రివేణి, సూర్య, సీవీ రామన్, వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను.. సిట్టింగ్ స్క్వాడ్ బృందం శ్రీరంగాపురం, గోపాల్‌పేట, పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొత్తకోట శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
‘ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి’
పాన్‌గల్: ఉపాధి పనుల్లో ఆన్‌లైన్ మస్టర్ విధానాన్ని తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ కోరారు. స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా మంగళవారం సీపీఎం బృందం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీసింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులు ఖర్చుచేసే వారని.. కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించేలా నిబంధనలు విధించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజువారీ కూలి రూ.600 చెల్లిస్తూ.. ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. మరో బృందం పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో తెల్లరాళ్లపల్లి, కేతేపల్లిలో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆరా తీసింది. ఉపాధిహామీ పథకాన్ని రక్షించుకునేందుకు కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూర్యవంశం రాము, దేవేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


