ఖిల్లాఘనపురం: కాంగ్రెస్‌పార్టీ కన్నతల్లి లాంటిదని, కష్టపడి నమ్మకంగా పనిచేసిన వారికి అండగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో కాంగ్రెస్‌పార్టీ మండల నాయకుల విస్తృతస్థాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరవగా.. పలువురు నాయకులు వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అదేవిధంగా పార్టీని నమ్ముకొని వచ్చిన కొత్తవారి సహకారంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచామని.. కాబట్టి వారికి కూడా సముచిత స్థానం కల్పించనున్నట్లు వివరించారు. ఎవరుకూడా పదవులు రాలేదని నిరాశ చెందొద్దని.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్ముందు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అందరు ఐఖ్యంగా పనిచేయాలని సూచించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌పార్టీ అంటేనే అభివృద్ధికి నిదర్శనమని.. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు అన్ని తామె చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం మండలపార్టీ అధ్యక్ష పదవి కోరుకుంటున్న వారి పేర్లు చెప్పాలని అడగగా.. మొత్తం 7 మంది పేర్లను రాయించారు. పరిశీలించి అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాసులుగౌడ్, విజయ్‌కుమార్, సాయిచరణ్‌రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి యాదయ్య, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకటేశ్వరరావు, గంజాయి రమేష్, ప్రభాకర్‌రెడ్డి, డా. నరేందర్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, జయాకర్, కొత్త గొల్ల కృష్ణయ్య, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


