వనపర్తిటౌన్: దేశాభివృద్ధికి యువతే మూల స్తంభమని.. మత్తుకు బానిస కాకుండా చదువుపై శ్రద్ధ సారించి దేశాన్ని ప్రపంచంలోనే ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డౠ్ల్యసీసీఎం కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే మత్తుకు బానిసైతే దేశం నాశనం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం నేరమని, అందుకు కఠిన శిక్షకు అర్హులవుతారని చెప్పారు. మాదక ద్రవ్యాలతో వారి జీవితాలే కాకుండా కుటుంబాలు నాశనమవుతాయని చెప్పారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో తదితర చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ శ్రీదేవి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


