ఖిల్లాఘనపురం: ప్రతి ఒక్కరికీ తాగునీటి ప్రాముఖ్యత తెలిసి ఉండాలని, తాగునీటి సమస్యలతో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. ఆదివారం మండలంలోని సోళీపురం గ్రామంలో ‘జల్ మహోత్సవ్’ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యతపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ ఏర్పాటు చేసి తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీల్లో నిర్వహించే గ్రామసభల్లో పరిశుభ్రత, పచ్చదనం, శుద్దిచేసిన తాగునీరు తదితర విషయాలపై చర్చించాలన్నారు. మహిళలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవ చూపాలని, సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల ఆరోగ్యం విషయంలో తాగునీటి ప్రాముఖ్యత అవసరమనే విషయాన్ని మరవొద్దని సూచించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలకు హర్ ఘర్ జల్ సర్టిఫికెట్లను అందించారు. నీటి బదిలీ అంశంలో భాగంగా సర్పంచ్ సింధుకు నీటి బదిలీ సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఈఈ అంజద్‌బాషా, డీఈలు హరీశ్‌కుమార్, జయపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఏఈలు బండారు రవీందర్, నరేష్, గ్రామపెద్దలు, మహిళలు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
వంట గ్యాస్ ధర
తగ్గించాలంటూ నిరసన
వనపర్తి రూరల్: పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర భారీగా పెంచి పేదలపై భారం మోపిందని ఆరోపించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచిందని.. ధరల పెరుగుదల భారం సాధారణ ప్రజలతో పాటు చిరు వ్యాపారులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులపై పడుతుందన్నారు. దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరాలో అంతరాయం గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి గతంలో వెల్లడించారని, చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం తెలిపిందని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన ధరలు తగ్గించాలని.. లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.పరమేశ్వరాచారి, పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, నాయకులు డి.కురుమయ్య, జి.బాలరాజు, నందిమళ్ల రాములు, జి.భాస్కర్, శేషయ్య, డి.గట్టయ్య, విజయకుమార్, బి.కురుమయ్య, జి.మన్యం, డి.బాలరాజు, జి.రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు అప్పరాల క్రీడాకారులు
కొత్తకోట రూరల్: వనపర్తిలోని డా. బాలకిష్టయ్య క్రీడా మైదానంలో ఆదివారం 3వ తెలంగాణ రాష్ట్ర రిలే కార్నివల్ మీట్–2026కు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. అండర్–14, అండర్–20 విభాగాల్లో పురుషులు, మహిళల ఎంపికల్లో అప్పరాల గురుకుల డిగ్రీ కళాశాల క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. అండర్–14 విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో చందన ద్వితీయ స్థానం, అండర్–20 విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో జోత్స్న మొదటి స్థానం, సాయి చందన ద్వితీయ స్థానం సాధించారు. అదేవిధంగా పురుషుల సీనియర్ విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో కె.గణేశ్ మొదటి స్థానం, ఎం.అజయ్‌కుమార్ ద్వితీయ స్థానం సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 15న హన్మకొండ జేఎన్ స్టేడియం, వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వ్యాయామ శిక్షకుడు ఎం.అజయ్‌కుమార్ తెలిపారు.


