● బీసీ సర్పంచ్‌లను ఇబ్బందులకు
గురిచేస్తే సహించం
● రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
వనపర్తి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం ఆగదని.. బీసీ సర్పంచ్‌లను ఇబ్బందులు, ఒత్తిడికి గురి చేసినా సహించమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలో బీసీ సర్పంచులు, ఉప సర్పంచుల సన్మానసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏ కుల రిజర్వేషన్‌లో లేని క్రిమిలేయర్ బీసీ రిజర్వేషన్‌లో ఉండటం వివక్షతో అణగదొక్కడమేనని, తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడానికి కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ ఎదుగుదలకు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ బిల్లును సాధించుకునే వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయకపోయినా 60 శాతానికి పైగా గ్రామపంచాయతీలు, పురపాలికల్లో బీసీలే గెలుపొందారని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ సాధించడానికి పెద్దఎత్తున పోరాటాలు చేసేందుకు ప్రతి బీసీ బిడ్డ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనాభా పరంగా ఎక్కువ మందిమే ఉన్నా.. అగ్రవర్ణ నేతలు చిన్నచూపు చూస్తూనే ఉన్నారని, బీసీల ఐక్యత ఎలా ఉంటుందో అందరికీ చూపించాల్సిన సమయం ఉంచిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు అరవింద్‌స్వామి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధారాసింగ్, రమేష్, జహంగీర్ పాషా, రఘునందన్‌చారి, సతీష్, గోపి, ముకుందనాయుడు తదితరులు పాల్గొన్నారు.


