వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ బాంకెట్ హాల్‌లో శనివారం పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు ఎంఎస్‌ఎంఈ డీఎఫ్‌ఓ హైదరాబాద్, జిల్లా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఈడీసీ), వనపర్తి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వకర్మ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మేనేజర్ చంద్రశేఖర్ పథకం గురించి వివరంగా తెలియజేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. అలాగే పథకం ద్వారా చేకూరే ప్రయోజనాలు, రుణ సదుపాయం, శిక్షణపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు తమ సందేహాల నివృత్తి, అప్లికేషన్‌లోని లోపాలను సరిచేసుకోవడానికి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదిస్తే సాయం అందిస్తామన్నారు. విశ్వకర్మ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందాలని, సంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారు ఈ పథకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి, డీపీఎం నాగమల్లిక, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాండురంగం, డీఆర్డీఏ సూపరింటెండెంట్ ప్రభాకర్, పరిశ్రమలశాఖ ఐపీఓ నాగేష్, ఎంఎస్‌ఎంఈ డీఎఫ్‌ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గురుస్వామి, ఈడీసీ మేనేజర్ శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.


