స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి

Mar 7 2026 9:36 AM | Updated on Mar 7 2026 9:36 AM

వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 15 వరకు కొనసాగే పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి పిలుపునిచ్చారు. శుక్రవారం మొదటి థీమ్‌ అయిన ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించగా.. పుర చైర్‌పర్సన్‌ మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్‌ ఫైల్స్‌ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. అలాగే అధికారులు తమ కార్యాలయాల్లోని పెండింగ్‌ ఫైల్స్‌ను త్వరగా క్లియర్‌ చేయాలని సూచించారు. వానాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా నిరోధించి వ్యాధులను దూరం చేయాలన్నారు. పది రోజుల్లో మురుగు కాల్వలతో పాటు రహదారులను కూడా శుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా పురపాలికల ఆదాయం పెంపునకు పన్ను వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, డీపీఆర్వో సీతారాం, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ..

జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. త్రైమాసిన తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, రెవెన్యూ అధికారులు చక్రపాణి, సి–సెక్షన్‌ సిబ్బంది రాజేష్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మయ్య, శంకర్‌, వేణాచారి, పరమేశ్వరాచారి, కుమారస్వామి, ఆంజనేయులు, గట్టు యాదవ్‌ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement