వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయని ప్రధాన అర్చకుడు విష్ణునారాయణ తెలిపారు. చివరిరోజు ఉదయం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమం, అవభృత స్నానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సాయంత్రం పుష్పయాగం, ద్వాదశారాధన జరిగాయి. 12 రకాల పూలను 12 ఆరాధనలతో స్వామివారికి విశేషంగా సమర్పించారు. ధ్వజ అవరోహణం, నాగావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు కిట్టుస్వామి, గోవిందాచార్యులు, కన్నయ్యస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
వనపర్తిటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 4,803 మంది విద్యార్థులకుగాను 4,581 మంది విద్యార్థులు హాజరుకాగా.. 222 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జనరల్ విద్యార్థులు 3,726 మందికిగాను 3,537 మంది పరీక్ష రాయగా.. 189 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,077 మందికిగాను 1,044 మంది హాజరుకాగా.. 33 మంది రాయలేదు. జిల్లాకేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల తనిఖీని డీఐఈఓ పరిశీలించి, త్రివేణి, జాగృతి, వాగ్దేవి, అభ్యాస్, రావూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈసీ బృందం పాన్‌గల్, వీపనగండ్ల, పెబ్బేరు, శ్రీరంగాపురం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాల, విజ్ఞాన్, స్కాలర్స్, గోపాల్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి, ఖిల్లా ఘనపురం, పాన్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్కాలర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.


