విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం
● ‘హెల్త్ మిషన్–100‘ పేరిట ప్రత్యేక కార్యక్రమం
● జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా మార్చి 2 నుంచి జూన్ 9 వరకు ‘హెల్త్ మిషన్–100’ పేరిట 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్ రెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో రాష్ట్రీయ బాలస్వాస్త్‌య్ బృందాలతో సమీక్ష నిర్వహించి ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు పోషకాహార, ఎదుగుదల లోపం, కంటి సమస్య గుర్తింపునకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తారన్నారు. రక్తహీనత నివారణకు ప్రతి విద్యార్థికి హిమోగ్లోబిన్ పరీక్ష చేసి అవసరమైన వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తారని చెప్పారు. దీంతోపాటు విద్యార్థులకు రుతుక్రమ పరిశుభ్రత, యోగా, అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు ఇచ్చే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికా రి డా. పరిమళ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


