రైతుకు భరోసా ఏది? | - | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసా ఏది?

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

రైతుకు భరోసా ఏది?

రైతుకు భరోసా ఏది?

హామీ అమలేది?

ఎన్నికలు ముగిసినా

జమకాని నిధులు

వడ్డీ వ్యాపారులే

దిక్కంటున్న

అన్నదాతలు

జిల్లాలో 1.75 లక్షల

మంది రైతులు

మదనాపురం: వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం అమలు చేస్తోంది. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్‌లో నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. అమలులో ఉన్న సమస్యలు, జాప్యం, స్పష్టతలేమి కారణంగా ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిగా విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఏడాది వానాకాలం సీజన్‌లోనూ రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు.. 5, 6 ఎకరాలున్న చిన్న, మధ్య తరహా రైతులు కూడా నష్టపోయారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. యాసంగి సీజన్‌ ముగుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ రైతుభరోసా నిధులు విడుదల చేయకుండా సాగదీస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పంటలు చేతికందే సమయం వచ్చినా పెట్టుబడి సాయం మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు.

జిల్లాలోని సుమారు 1,75,800 రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.205.94 కోట్లు అవసరమవుతాయని అంచనా. సకాలంలో అందకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. సాగునీటి ఎద్దడి, ఎండల తీవ్రతకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రెండు సీజన్‌లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు మొత్తం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండు సీజన్లకు కాకుండా ఒక్క సీజన్‌కు రూ.6 వేల చొప్పున మాత్రమే జమ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు కాలేదనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది.

యాసంగి సీజన్‌ ముగుస్తున్నా.. అందని పెట్టుబడి సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement