వైభవంగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు గురువారం ఉదయం మంగళ వాయిద్యాలు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. యజ్ఞశాలలో హోమం, భేరీపూజ కొనసాగాయి. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల భక్తులు తరలిరాగా.. వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్యశర్మ, గోవిందాచార్యులు, సురేశాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు
పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో గురువారం వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్ట అహోబిల రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తండావాసులు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌లు గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
వైభవంగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు


