బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

వనపర్తి: ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సిబ్బంది ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. రోజు హాజరు నివేదికలను సమర్పించాలన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌), ఎంసీహెచ్‌ను ఆయన సందర్శించి వాటి పరిధిలో నిర్మాణంలో ఉన్న పలు విభాగాలను పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. సదరం క్యాంపు భవనాన్ని ఆదర్శ భవనంగా తీర్చిదిద్దాలని, దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు చేయాలని, నాణ్యమైన వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే సీటీ స్కాన్‌ భవనం పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్‌ అధికారులను కోరారు. జీజీహెచ్‌ ఆవరణలో కొనసాగుతున్న సీసీ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని పుర కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు మెరుగుపర్చాలన్నారు. క్రమశిక్షణతో సేవలు అందించడమే సిబ్బంది లక్ష్యమని చెప్పారు.

చిన్నపిల్లల వార్డు తనిఖీ..

ఎంసీహెచ్‌లోని చిన్నపిల్లల వార్డును తనిఖీ చేసిన కలెక్టర్‌ చిన్నారులకు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. వెంటిలేటర్‌ పని చేస్తుందా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులను సిఫారస్‌ చేసే ఎన్‌ఆర్‌సీ విభాగాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఎస్సీ హాస్టల్‌ భవన నిర్మాణం పరిశీలన..

జిల్లాకేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. మార్చి 10 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చివరి దశలో ఉన్న పనులు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కలెక్టర్‌ వెంట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఉమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement