పకడ్బందీగా ఓటరు జాబితా
వనపర్తి టౌన్: పురపాలికల వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పుర కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు. అక్టోబర్ 1, 2025 నాడు ప్రచురించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు, మృతిచెందిన ఓటర్లను పరిగణలోకి తీసుకోమని తెలిపారు. తుది ఓటరు జాబితా పార్ట్‌ల వారీగా వార్డుల మ్యాపింగ్ చేపట్టాలని, ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని, అదేవిధంగా కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల పేర్లు వారి సొంత వార్డులోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పుర కార్యాలయంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి మార్పుచేర్పులు ఉంటే 5వ తేదీలోగా ఫిర్యాదు చేయాలని కోరారు. తుది ఓటరు జాబితా జనవరి 10న అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. వార్డుల వారీగా తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, పుర సిబ్బంది పాల్గొన్నారు.


