కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
అమరచింత/ఆత్మకూర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. అమరచింత మండలం చంద్రానాయక్‌తండాలో హైమాస్ట్ లైట్లతో పాటు అయ్యప్ప ఆలయంలో రూ.ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం, ఆత్మకూర్ మండలం మూలమళ్లలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని.. కేంద్ర నిధులను తమవంటూ ప్రచారం చేసుకోవడం అవివేకమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలమూర్–రంగారెడ్డి ఎప్పుడు పూర్తి చేస్తారో జిల్లా రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ మద్దతుతో గెలిచిన చంద్రనాయక్‌తండా సర్పంచ్ కృష్ణానాయక్‌తో పాటు కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డిని సన్మానించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మేర్వరాజు, క్యామ భాస్కర్, మరాఠి అశోక్, మంగ లావణ్య, మూలమళ్లలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు దేశాయి పద్మజారెడ్డి, కాంతారెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, అశ్విన్‌కుమార్, అశోక్, లావణ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


