‘పాలమూరు’కు పెద్దపీట హాస్యాస్పదం
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. అంత ప్రాధాన్యమిస్తే పనులు ఎందుకు పూర్తి కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.74 వేల కోట్లు వ్యయం కానుండగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి 90 పనులు పూర్తి చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఇరుపార్టీల నాయకులు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని.. పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలి తీర్చే ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం నీరుగార్చేందుకు వీబీజీ రాంజి పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని.. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు పంచాయతీలే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షాన్ని పిలవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్, లక్ష్మి, జీఎన్ గోపి, పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, మహబూబ్ పాషా, బాల్యానాయక్, ఆర్‌ఎన్ రమేష్, కృష్ణయ్య, వెంకట్రాములు తదితరలు పాల్గొన్నారు.


