పకడ్బందీగా వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ
వనపర్తి: త్వరలో నిర్వహించే పుర ఎన్నికలకుగాను వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పుర కమిషనర్లు, మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 1న వార్డుల వారీగా ముసాయిదా ఎలక్ట్రోరల్ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా, వార్డులో అసెంబ్లీ ఉప విభాగాల వివరాల ఆధారంగా ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను జనవరి 5 నుంచి స్వీకరించి పరిష్కరించిన, తప్పులు లేని తుది ఓటరు జాబితాను 10వ తేదీన ప్రకటించాలని ఆదేశించారు. 5వ తేదీన పుర కమిషనర్లు ప్రముఖ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి వార్డుల వివరాలు తెలిపి అభ్యంతరాలు తీసుకోవాలని, జనవరి 6న కలెక్టరేట్‌లో కలెక్టర్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. వార్డుల మ్యాపింగ్ తప్పులు లేకుండా పకడ్బందీగా సిద్ధం చేస్తే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్లు, మేనేజర్లు, సి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


