నేడు డయల్ యువర్ డీఎం
వనపర్తిటౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని గ్రామస్తులు, ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను సెల్‌నంబర్ 99592 26289కు ఫోన్‌చేసి తెలియజేయాలని పేర్కొన్నారు. డిపో అభివృద్ధి, కండక్టర్లు, డ్రైవర్ల పనితీరుపై సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటూ ధర్నా
గోపాల్‌పేట: ఏదుల రిజర్వాయర్ ఉండగా మళ్లీ గొల్లపల్లి రిజర్వాయర్ ఎందుకని.. రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉందని, వెంటనే పనులు నిలిపివేయాలని గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాల రైతులు, గ్రామస్తులు మంగళవారం గొల్లపల్లి గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిలోమీటర్ దూరంలోనే ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కేఎల్‌ఐ చేపట్టి నీటినిల్వకు రిజర్వాయర్ నిర్మించకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మిగిలిన కేఎల్‌ఐ పనులు పూర్తిచేసి ఐదు మండలాల్లోని 75 వేల ఎకరాలకు సాగునీరు అందించారని వివరించారు. గతంలో కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు గొల్లపల్లి రిజర్వాయర్ ప్రస్తావన తెచ్చారని.. తర్వాత రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విరమించుకున్నారని చెప్పారు. కొల్లాపూర్, వనపర్తి ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఏదుల రిజర్వాయర్‌కు తూము ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం అవసరం లేకున్నా గొల్లపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టి రైతుల భూములు లాక్కోవద్దని కోరారు. పనులు చేపడితే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామనిహెచ్చరించారు.


