అందుబాటులో యూరియా
● యాసంగిలో రైతులకు
కావాల్సినంత యూరియా అందిస్తాం
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: యాసంగి 2025–26 సీజన్‌కు సంబంధించి జిల్లా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని.. ప్రతి రైతుకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. యూరియా సరఫరాపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. వీసీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా, నేరుగా రైతులకు అవసరమైన యూరియా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రైవేటుతో పాటు ప్రభుత్వ, పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోజు ఉదయం 6 గంటల నుంచే యూరియా పంపిణీ ప్రారంభం కావాలన్నారు. అదే విధంగా సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులు దొడ్డురకం వైపు దృష్టిసారించకుండా సన్నరకాలే వేసే విధంగా మండల వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వీసీలో ఇన్‌చార్జి డీఏఓ దామోదర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, డీసీఓ రాణి పాల్గొన్నారు.
వైకల్యం శరీరానికే.. లక్ష్యసాధనకు కాదు
వైకల్యం అనేది శరీరానికి మాత్రమే అని.. లక్ష్యసాధనకు కాదని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో సకలాంగులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. దివ్యాంగులందరూ తమ వైకల్యాన్ని అధిగమించి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం బాలానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అశ్విన్‌ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కేవలం రెండో తరగతి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థి అశ్విన్.. రాష్ట్రం పేరు చెబితే రాజధాని పేరు, రాజధాని పేరు చెబితే రాష్ట్రం పేరు వెంటనే చెప్పేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా జిల్లా సమాఖ్య సభ్యులతో పాటు క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన దివ్యాంగులను కలెక్టర్ శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, మానసిక వైద్యురాలు పుష్ప, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు మీసాల మోహన్, మధు పాల్గొన్నారు.
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 30 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు.


