
కథ ముగిసిందా..?
మిల్లులో
అధిక ధాన్యం నిల్వలు..
ఏడురోజుల తర్వాత ధాన్యం లారీని వదిలేసిన అధికారులు
● సింగిల్‌లైన్ నివేదిక ఇచ్చిన టీఏ
● మిల్లులో లెక్కకు మించి
నిల్వల మాటేమిటి?
● నామమాత్రపు జరిమానా విధింపు
●
వనపర్తి: పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం లారీని విచారణ పేరుతో ఏడురోజుల కాలయాపన తర్వాత క్లీన్‌చిట్ ఇచ్చి నామమాత్రపు జరిమానా విధించి అధికారులు రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఒక్కో లోపానికి ఒక్కో కారణం చెబుతూ అన్ని సక్రమంగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతృప్తి చెందడంతో వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో ధాన్యం తరలిస్తున్నారనే విషయంపై ఇదే అధికారులు సీరియస్‌గా స్పందించి కేసునమోదు చేసిందేలా.. ప్రస్తుతం రేషన్ డీలర్లతో సంచులు కొనుగోలు చేసినట్లు సాకు చూపుతూ సమర్థించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 14 సాయంత్రం అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల హడావుడిలో ఉన్న సమయంలో జిల్లాకేంద్రం నుంచి కర్ణాటకకు ధాన్యం లారీలో తరలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం పౌరసరఫరాలశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. విచారణ పేరుతో ఏడురోజుల పాటు కాలయాపన చేసి తుదకు కథను సుఖాంతం చేశారు.
సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం ప్రభుత్వానిదేనా? ఏ రకం? ఏ సీజన్‌కు సంబంధించి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల టీఏ, హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించి అనాలసిస్ చేయించాల్సి ఉండింది. కాగా స్థానిక టీఏ మాత్రం పట్టుబడిన ధాన్యం బీపీటీ రకమని, సన్నరకం వరి ధాన్యమని సింగిల్‌లైన్ నివేదిక ఇచ్చి వదిలేశారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు ఈ అంశంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విముఖత చూపడం గమనార్హం.
పట్టుబడిన ధాన్యానికి సంబంధించిన రైస్‌మిల్లు యజమాని సీఎంఆర్ 99 శాతం పూర్తిచేశారు. బయటి మార్కెట్ నుంచి ధాన్యం తీసుకొచ్చి మర ఆడించినట్లు రికార్డుల్లో చూపించినా.. అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఉండాల్సిన ధాన్యం కంటే ఎక్కువ నిల్వలు ఉన్నట్లు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ కోణంలో విచారణ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ, బీ రిజిస్టర్లలో వివరాలు సరిపోలకపోయినా.. ఎందుకు మిన్నకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.