
అధికారుల్లో ‘ఆర్టీఐ’ వణుకు..
వనపర్తి: సుదీర్ఘకాలంగా సమాచార కమిషనర్ లేక పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించేందుకు శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమాచారం ఇచ్చే విషయంలో అర్జీలను నిర్లక్ష్యం చేసిన కొన్ని శాఖల అధికారులు ప్రత్యేక విచారణలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయనే భయంతో అర్జీదారులతో రాజీ పత్రాలు రాయించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా సమాచార హక్కు చట్టం–2005ను నిర్లక్ష్యం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన అధికారుల్లో కనిపించింది. జిల్లాలో మొత్తం 90 అర్జీలు పెండింగ్‌లో ఉండగా.. మున్సిపాల్టీలు, రెవెన్యూశాఖకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
‘అమృత్ 2.0’
నీటి ట్యాంకుల పరిశీలన
అమరచింత: అమృత్ 2.0 పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న నీటిట్యాంకుల నిర్మాణ పనులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇంటర్నల్ రిపోర్టింగ్, మానిటరింగ్ ఏజెన్సీ బృందం పరిశీలించింది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింతలో కొనసాగుతున్న నీటిట్యాంకుల నిర్మాణ పనులను నిషితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలకు ఓసారి ఇర్మా ఆధ్వర్యంలో పనులను పరిశీలించి నాణ్యత వివరాలను కేంద్రానికి నివేదిస్తున్నట్లు వెల్లడించారు. డీఈ చంద్రశేఖర్, కంపెని మేనేజర్ ఎన్.శ్రీనివాసులు, ఇర్మా కో–ఆర్డినేటర్ నవీన్ పాల్గొన్నారు.
నేటి ధర్నాను
విజయవంతం చేయండి
వనపర్తిటౌన్: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించే ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడంతో పాటు ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి డి.కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బి.వెంకటేష్, కె.జ్యోతి, హమీద్, శ్రీనివాస్‌గౌడ్, రామన్‌గౌడ్, జి.మురళి, అరుణ, వెంకటేశ్వర్లు, సూరయ్య, మల్లికార్జున్, డి.రాముడు, మద్దిలేటి, రాములు యాదవ్ పాల్గొన్నారు.
విద్యుత్తు సరఫరా
నిలిపివేత
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని బాలానగర్‌లో ఉన్న 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 55 హెపీ ట్రాన్స్‌ఫార్మర్ బిగింపు సందర్భంగా శనివారం ఉదయం 9 నుంచి 11 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలానగర్, నర్సింగాయపల్లిరోడ్‌లోని డిగ్రీ కళాశాల, మెటర్నిటీ, చిల్డ్రన్ ఆస్పత్రి, అప్పాయపల్లిరోడ్, నందిమళ్లగడ్డ, వశ్యానాయక్‌తండా, పాతబజార్, కుమ్మరిగేరి, సవరం స్ట్రీట్, కమలానగర్, గాంధీనగర్, రాయిగడ్డకాలనీ, రాంనగర్‌కాలనీ, బ్రహ్మంగారి వీధి, శారదనగర్, చిట్యాలరోడ్, శ్వేతానగర్, తిరుమలకాలనీ, వల్లభ్‌నగర్, పీర్లగుట్ట, బంగారునగర్, పాన్‌గల్ రోడ్, గాంధీచౌక్, భగత్‌సింగ్‌నగర్, మెంటేపల్లితో పాటు చిన్నగుంటపల్లి, గోపాల్‌పేట, రాజపేట ఫీడర్‌లోని ప్రాంతాలకు ఆయా సమయంలో విద్యుత్ సరఫరా ఉండదని.. గృహ, వ్యాపార, పరిశ్రమలు, వ్యవసాయ వినియోగదారులు అంతరాయా న్ని గమనించి సహకరించాలని పేర్కొన్నారు.