
ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమ ఫలాలు
ఖిల్లాఘనపురం: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఆయన రాత్రి తన స్వగ్రామం సల్కెలాపురంలో బసచేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలో మార్నింగ్‌వాక్ నిర్వహించారు. వీధుల్లో తిరిగి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రూ.20 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి అదనపు తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత తొలగిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అప్పారెడ్డిపల్లికి చెందిన కొత్తగొల్ల అంజమ్మ ఉపాధి నిధులు రూ.3 లక్షలతో నిర్మించిన నాటుకోళ్ల ఫాంను ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖిల్లాఘనపురం–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై రూ.2.95 కోట్లతో నిర్మించిన హైలేవల్ వంతెనను ప్రారంభించడంతో పాటు రూ.45 లక్షలతో నిర్మించే మత్య్సకారుల సామూహిక భవనానికి భూమి పూజ చేశారు. సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, నాయకులు సాయిచరణ్‌రెడ్డి, ఆగారం ప్రకాష్, వెంకటేశ్వర్‌రావు, విజయ్‌కుమార్, గంజాయి రమేష్, నాగేశ్వర్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం..
గోపాల్‌పేట: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం గోపాల్‌పేట, రేవల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నాగశేషు మరణించిన విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించాడు. అనంతరం బుద్దారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని, చాకల్‌పల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. రేవల్లి మండలంలోని తల్పునూరుతండాలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త బండరావిపాకులలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఏదుల, చెన్నారం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు, కేశంపేట గేట్‌వద్ద హై లేవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.