
ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం
ఏళ్లు గడుస్తున్నా..
అమరచింత: జిల్లాలో చౌకధర దుకాణాల ద్వారా పేదలకు బియ్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న దుకాణాలకు డీలర్ల నియామకం చేపట్టకుండా ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తుంది. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో 324 రేషన్ దుకాణాలుండగా.. 29 దుకాణాలకు డీలర్లు లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండటంతో ఖాళీగా ఉన్న దుకాణాల్లో ఇన్‌చార్జ్‌లతో మమా అనిపిస్తున్నారు. బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వెంటనే ప్రకటన జారీ చేసి డీలర్ల నియామకం చేపట్టాలని ఆయా గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఖాళీల భర్తీపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోగా.. ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
పని భారం..
డీలర్లు లేని రేషన్ దుకాణాల సరుకుల పంపిణీ బాధ్యతను సమీప గ్రామాల వారికి అప్పగించడంతో పని భారానికి గురవుతున్నారు. ఒకేసారి రెండు దుకాణాల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి రావడంతో గందరగోళం నెలకొంటుందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 29 ఖాళీలు
ప్రకటన జారీ చేస్తామంటూ
కాలయాపన చేస్తున్న అధికారులు
నాలుగేళ్లుగా ఆశావహుల
ఎదురుచూపులు
వివిధ కారణాలతో చనిపోయిన, అధికారుల తనిఖీల్లో పట్టుబడి తొలగించిన డీలర్ల స్థానంలో కొత్తవారి నియామకం నాలుగేళ్లుగా జరగలేదు. సమస్యను గ్రామాలకు వస్తున్న ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను అడిగితే ఇప్పుడు.. అప్పుడంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప కొత్తవారిని నియమించడం లేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించడంతో ఎస్టీ సామాజిక వర్గానికి కొత్తగా రేషన్ దుకాణాలకు కేటాయించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కేటగిరీల వారీగా ఎవరికి కేటాయిస్తారో అన్న విషయాన్ని సైతం వెల్లడించకపోవడంతో అయోమయం నెలకొంది.