
పేదరిక నిర్మూలనకు రాజీవ్‌గాంధీ కృషి
వనపర్తిటౌన్: పేదరికం రూపుమాపేందుకు కృషి చేసిన మహానేత దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని రాజీవ్‌విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, బాలల పోషణకు కేంద్ర సహాయ పథకాలు రాజీవ్‌గాంధీ కృషితోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. గ్రామీణ టెలిఫోన్ నెట్‌వర్క్, టెలివిజన్ ప్రసారాలను విస్తరించి సమాచార విప్లవానికి బీజం వేశారని కొనియాడారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, రాష్ట్ర మైనార్టీ నాయకులు సయ్యద్ అక్తర్, కమర్‌మియా, నాయకులు కిరణ్‌కుమార్, బాబా, జానకిరాములు, నారాయణ, సి.పెంటన్న, రోహిత్, నాగార్జున, రాగి అక్షయ్, ఇర్ఫాన్, సురేష్‌గౌడ్, జానకమ్మ పాల్గొన్నారు.
ఇంటర్ ప్రవేశాల
గడువు పొడిగింపు
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కోల్పోకుండా అర్హత గల వారిని చేర్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.
రేపు జిల్లాస్థాయి
క్రీడాకారుల ఎంపికలు
వనపర్తిటౌన్: మహబూబ్‌నగర్‌లోని పాల మూరు యూనివర్సిటీలో ఈ నెల 30, 31న జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు జిల్లాకేంద్రంలోని బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఉదయం 9 గంటల వరకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ (సెల్‌నంబర్ 80961 15222) సంప్రదించాలని సూచించారు.
‘నీట్’ పీజీలో ప్రతిభ
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన స్వప్న, భాస్కర్‌రెడ్డి దంపతుల కుమారుడు రిత్విక్‌రెడ్డి ఇటీవల వెలువడిన నీట్ పీజీ ఫలితాల్లో ఆలిండియాలో 16వ ర్యాంక్ సాధించారు. 2019 నీట్ యూజీలోనూ 430 ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్‌లోని భూపాల్ ఎయిమ్స్‌లో మెడిసిన్ పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంట్లోనే చదివి 684 మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

పేదరిక నిర్మూలనకు రాజీవ్‌గాంధీ కృషి