
పైలెట్ మండలంగా గోపాల్‌పేట ఎంపిక
వనపర్తి: భూ భారతి–2025 రెవెన్యూ సదస్సుల నిర్వహణకుగాను జిల్లాలో గోపాల్‌పేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి మండలంలో జరిగే రెవెన్యూ సదస్సులను మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రెండు రెవెన్యూ బృందాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించి మిగిలిన సమస్యలను మే 13 నుంచి 20వ తేదీలోపు పరిష్కరించేలా సూచనలు చేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలకు భూ సమస్యలకు సంబంధించిన నమూనా దరఖాస్తులు ముందుగానే పంపిణీ చేస్తారని, వాటిని సరిగా పూరించి రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ఉష్ణోగ్రతలు పెరిగిన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12లోపే బయటి పనులు పూర్తి చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళలో బయట తిరగకపోవడం మంచిదని, బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు వెంట తీసుకువెళ్లాలి, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందాలన్నారు. వడదెబ్బ తగలకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని.. చల్లటి నీరు, ఓఆర్‌ఎస్ ద్రావణం, పండ్ల రసాలు తీసుకోవడం, తేలికై న దుస్తులు ధరించడం ముఖ్యమని తెలిపారు.
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు