పేదలకు నాణ్యమైన సన్న బియ్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం

Apr 11 2025 12:48 AM | Updated on Apr 11 2025 12:48 AM

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం

వనపర్తి: ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని బండార్‌నగర్‌లో ఉన్న 19వ నంబర్‌ రేషన్‌ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సన్న బియ్యం పంపిణీపై ఆరా తీశారు. బియ్యం నిల్వలకు సంబంధించి రిజిస్టర్‌ నిర్వహించడమేగాకుండా లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకున్నాక తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని డీలర్‌కు సూచించారు. ఇక నుంచి ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని.. పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ సందర్శన..

జిల్లాకేంద్రంలోని నల్ల చెరువు ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్లచెరువు పరిసరాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు, మూడురోజుల్లో చెరువుకట్టపై ఏర్పాటు చేయనున్న వాకింగ్‌ ట్రాక్‌కు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ దగ్గర సీసీ కెమెరాలు బిగించాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. ఓపెన్‌ జిమ్‌ మీదుగా ఉన్న విద్యుత్‌ తీగలను పక్కకు మార్చాలన్నారు. పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెతో పాటు విద్యుత్‌ స్తంభాలకు లైట్లు బిగించాలని కోరారు.

వసతిగృహాల తనిఖీ..

జిల్లాకేంద్రంలోని పీర్లగుట్టలో ఉన్న షెడ్యూల్డ్‌ కులాల బాలికల వసతి గృహాన్ని గురువారం కలెక్టర్‌ సందర్శించారు. పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌ను కూడా సందర్శించి విద్యార్థుల వసతి, సామర్థ్యాలపై ఆరా తీశారు. అదే ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని పంచాయతీరాజ్‌ డీఈకి సూచించారు. అనంతరం కేటీఆర్‌నగర్‌లో ఉన్న ఎస్సీ బాలుర వసతిగృహాన్ని సందర్శించి మరమ్మతులు చేయడానికి అవకాశం ఉందా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బసవన్నగడ్డలో ఉన్న బీసీ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్‌ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వసతి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా పౌరసంబంధాల అధికారి కాశీ విశ్వనాథ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మల్లికార్జున్‌, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement