వినియోగంలోకి జిల్లా సాయుధదళ కార్యాలయ భవనం
వనపర్తి: జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొచ్చిన ఎస్పీ రావుల గిరిధర్‌కు సాయుధ దళ పోలీసు అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటినుంచి కార్యాలయాన్ని వనపర్తి రెడ్డి సేవాసమితి భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల రూ.88 వేలు అద్దె చెల్లించడంతో పాటు సాయుధ పోలీసుల ఇబ్బందులను ఎస్పీ తెలుసుకొని అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణానికి ప్రత్యేక చొరవతో కలెక్టర్ ఆదర్శ్ సురభితో చర్చించారు. ఆయన నిధులు రూ.10 లక్షలు, పెబ్బేరు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అందించిన రూ.2.50 లక్షలతో నిర్మాణం పూర్తి చేయించారు. అత్యాధునిక హంగులతో ఆహ్లాదకర వాతావరణంలో విశాలమైన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏప్రిల్ 4న రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. గురువారం భవనం వినియోగంలోకి రావడంతో ఎస్పీని పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డ్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్పీని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


