యాదవులు అన్నిరంగాల్లో రాణించాలి
కొత్తకోట రూరల్: యాదవులు రాజకీయంతో పాటు విద్య, వ్యాపారం, సామాజిక సేవ తదితర రంగాల్లోనూ రాణించాలని రాష్ట్ర హౌసింగ్‌బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాములు యాదవ్ కోరారు. శనివారం పట్టణ సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించిన జిల్లాలోని యాదవ సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడని, గ్రామస్థాయిలో సర్వాధికారాలు ఉంటాయన్నారు. ప్రతి యాదవ సర్పంచ్ భవిష్యత్‌లో ఉన్నతస్థాయి పాలకులుగా ఎదగాలనే దిశగా పని చేయాలని సూచించారు. కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా గెలిచే శక్తిగా ఎదగాలన్నారు. జిల్లాలో యాదవ జనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో వారి పాత్ర మరింత బలపడాలని కోరారు. గతంలో అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. భవిష్యత్‌లోనూ అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు యాదవుల సంక్షేమానికి సహకరించాలన్నారు. సర్పంచులు, ఉపసర్పంచులు ఒకే వేదికపై కలిసి పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా మాజీ చైర్మన్ కురుమూర్తియాదవ్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్‌యాదవ్, యాదవ సంఘ నాయకులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


