ప్రజాపాలనకు సీఎం అడుగులే నిదర్శనం
వనపర్తిటౌన్: ముఖ్యమంత్రి హోదాలో సామాన్యు ల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలుసుకోవడం మామూలు విషయం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు సీఎం రేవంత్‌రెడ్డి వేస్తున్న అడుగులే నిదర్శనమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం వనపర్తి నియోజక వర్గానికి చెందిన 105 మందికి రూ. 30.07లక్షల విలువగల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంలో ప్రజాభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకే సీఎంను కలిసే భాగ్యం దక్కలేదన్నారు. ఆ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం రూపుమాపడంతో పాటు పాలనపై అంకితభావాన్ని చాటుకుందని అన్నారు. సీఎం హోదా ప్రజాసేవకు లభించిన అవకాశంగా రేవంత్‌రెడ్డి భావించి ముందుకెళ్తున్నారని చెప్పారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, నాయకులు ఖమర్, కోట్ల రవి, బాబా, నందిమళ్ల యాదయ్య, కోళ్ల వెంకటేశ్, రాగి వేణు, నాగరాజు, అబ్దుల్లా, అక్షయ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


