వనపర్తి రూరల్: రాబోవు కాలంలో వ్యవసాయ రంగం మిగిలిన రంగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు, సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు.
అనంతరం మాట్లాడుతూ.. తాను వ్యవసాయ పక్షపాతినని, భవిష్యత్‌లో వ్యవసాయ రంగం మిగిలిన రంగాలకు మార్గదర్శనం అవుతుందని భావించి ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 20 ఎకరాల స్థలం కేటాయించి అన్ని వసతులతో అద్భుతమైన భవనం నిర్మించాలని కృషిచేసినా.. దురదృష్టవశాత్తు తమ ప్రభుత్వం రాకపోవడంతో అభివృద్ధి ఆగిపోయిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో విశేష మార్పులు తీసుకురావడంతో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు.
వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ప్రత్యేక దృష్టి సారించి కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, విజయ్‌కుమార్, ఉంగ్లం తిరుమల్, నాగన్నయాదవ్, నందిమళ్ల అశోక్ , హేమంత్, చిట్యాల రాము, భాగ్యరాజ్, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ప్రదర్శన
అమరచింత: ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని గురువారం రాత్రి పట్టణంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల మీదుగా బస్టాండ్ కూడలి వరకు కొవ్వొత్తులతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ హ్యపీపాల్, కేవీపీఎస్ నాయకులు అజయ్, శ్యాంసుందర్ మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనని.. యాక్సిడెంట్‌గా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,646
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 6,646, కనిష్టంగా రూ. 5,222 ధరలు లభించాయి. అదే విధంగా కందులు గరిష్టంగా రూ. 6,001, కనిష్టంగా రూ. 5,000, మొక్కజొన్న గరిష్టంగా రూ. 2,281, కనిష్టంగా రూ. 1,827, జొన్నలు గరిష్టంగా రూ. 4,377, కనిష్టంగా రూ. 4,089, ఆముదాలు గరిష్టంగా రూ. 6,329, కనిష్టంగా రూ. 6,270, మినుములు రూ. 7,316, రాగులు గరిష్టంగా రూ. 3,077, కనిష్టంగా రూ. 2,207 ధరలు వచ్చాయి.
● దేవరకద్ర మార్కెట్‌యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 2,039, కనిష్టంగా రూ. 1,909 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 6,000 ధరలు వచ్చాయి. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్‌కు దాదాపు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
భవిష్యత్ వ్యవసాయ రంగానిదే..


