శాంతిభద్రతలు, ఆరోగ్యం కీలకం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలు, ఆరోగ్యం కీలకం

Mar 21 2025 12:55 AM | Updated on Mar 21 2025 12:51 AM

వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద హాస్పిటల్స్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, బాలల సంరక్షణ కమిటీ రాష్ట్ర సభ్యురాలు అపర్ణ, ఐఎంఏ అధ్యక్షుడు బాబు, యశోద ఆస్పత్రి జనరల్‌ సర్జన్‌ శ్రావ్య, సింధు ముఖ్యఅతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కనీసం ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా సమస్యలుంటే ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోగలుగుతామన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని.. అందులో భాగంగానే మిషన్‌ మధుమేహ, క్షయ తదితర కార్యక్రమాలతో ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, కలెక్టర్‌ కూడా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వనపర్తి జీజీహెచ్‌, ఎంసీహెచ్‌కు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి, జిల్లాకేంద్రంలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్పీ రావుల గిరిధర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఏవైనా సమస్యలు నిర్ధారణ అయితే చికిత్స కూడా అందిస్తారని, ఇందుకు సహకరించిన వైద్యశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్‌ కూడా పోలీసుశాఖ బలోపేతానికి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఏఆర్‌ విభాగం హెడ్‌క్వార్టర్‌ నిర్మాణానికి అడిగిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశారని, అదేవిధంగా డీఎస్పీ కార్యాలయ భవనానికి కూడా సహకారం అందించారని వివరించారు. జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్‌, ఎమ్మెల్యే సహకరిస్తున్నారని, అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించగలమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పోలీసుశాఖ తరఫున శాలువాలు కప్పి సన్మానించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఉమామహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement