
పంటల సంరక్షణకు చర్యలు
వనపర్తి రూరల్: జిల్లాలో రైతులు సాగుచేసిన యాసంగి పంటలు ఎండిపోకుండా సరిపడా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అన్నిరకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దగూడెంతండా పరిధిలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. తామంతా బోరుబావులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నామని.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని, ఆదుకోవాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. మొత్తం 36 మంది రైతులకు చెందిన 45 ఎకరాల పంట ఎండిపోయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సరిపడా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అటవీశాఖ నుంచి అభ్యంతరాలున్నందున దానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధి పనుల పరిశీలన..
మండలంలోని తిరుమలయ్యగట్టు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు, తాగునీటి వసతిని తనిఖీ చేశారు. ఎన్ని గంటల వరకు పనులు చేస్తున్నారని కూలీలను అడగ్గా మధ్యాహ్నం 12 వరకు చేస్తున్నామని బదులిచ్చారు. కూలీలతో ఏయే పనులు చేయిస్తున్నారని డీఆర్డీఓను ప్రశ్నించగా.. నీటి గుంతలు తీయించే పనులు చేయిస్తున్నామని సమాధానమిచ్చారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ, జిల్లా వ్యవసాయశాఖ అధికారితోపాటు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర వ్యవసాయ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి