వనపర్తి: అనుమతి లేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎల్‌ఆర్‌ఎస్‌పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేని, అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. అనధికారిక ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోకపోతే భవిష్యత్‌లో వాటిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండదన్నారు. అనుమతి లేని ప్లాట్లను తక్షణమే ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే రూ.వెయ్యి చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ వార్డు ఆఫీసర్ల ద్వారా ఫోన్‌కాల్స్ చేసి తెలియజేయాలని.. అవసరమైతే నోటీసులు కూడా జారీ చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని తెలిపారు. దరఖాస్తుదారులకు ఫోన్‌కాల్స్ చేసినప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ ప్రయోజనాల గురించి వివరించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఆస్తిపన్ను వసూలును వేగవంతం చేయాలన్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు.
భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నిరకాలుగా శిక్షణ, సహకారం అందించి సాధారణ పిల్లలతో సమానంగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో ఉన్న భవిత కేంద్రంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 69 మంది పిల్లలకు ఉచితంగా ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, క్లచర్స్, వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రంలో శారీరకంగా బలహీనమైన పిల్లలకు ఫిజియోథెరపీ, వినికిడి సక్రమంగా లేని పిల్లలకు ప్రత్యేకమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని భవిత కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘని, భవిత కేంద్రం అధికారి యుగేందర్, ఎంఈఓ మద్దిలేటి, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులపై
నిర్లక్ష్యం వద్దు..
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ప్రజావాణికి 43 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు
అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి