వనపర్తి: ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 51 అర్జీలు వచ్చాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి..
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్‌పీసీసీహెచ్, హీట్ వేవ్ టాస్క్‌ఫోర్స్ కమిటీలతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు చేసుకోవాలని.. అత్యవసర పనులు ఉంటేనే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు ఎండల తీవ్రతపై అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలన్నారు. శిశువులు, బాలబాలికలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం వైద్యారోగ్యశాఖ రూపొందించిన ‘వడదెబ్బ నుంచి రక్షించుకుందాం ‘ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


