నేడు సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

నేడు సంగ్రామం

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

విజయనగరం రూరల్‌:

జిల్లాలో పల్లె పోరుకు తెరలేచింది. జిల్లాలో 773 గ్రామ పంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిలో భాగంగా తొలి విడత ఎన్నికలు 221 గ్రామ పంచాయతీల్లో నిర్వహించాల్సి ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయినప్పటికి 36 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 185 గ్రామ పంచాయతీల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఎన్నికలు జరిగే 8 మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ద్వారా పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. రూట్ల వారీగా వారికి ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తి అయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.

తొలి విడతలో బొబ్బిలి డివిజన్‌ పరిధిలో బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాలు ఉండగా, విజయనగరం రెవెన్యూ డివిజన్‌లో కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌.కోట మండలాలు ఉన్నాయి. ఎన్నికలు నోటీఫై అయిన 773 పంచాయతీల్లో 221 ( 28.6 శాతం) ఈ దశలోనే ఉన్నాయి. వాటిలో 2108 వార్డులు, 2148 పోలింగ్‌ కేంద్రాలు, 3,81,351 మంది ఓటర్లు ఉన్నారు. 36 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 185 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి 429 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అలాగే 2108 వార్డులకు 654మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 1453 వార్డులకు 3013 మంది అభ్యర్థులు తలపడనున్నారు.

● కొత్తవలస మండలం సంతపాలెం పంచాయతీలోని పదో వార్డుకు నామినేషన్‌ దాఖలు కాలేదు. రెండు పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ ఏర్పడింది. అలాగే 9 పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, సర్పంచ్‌ స్థానాలకు పోటీ ఏర్పడింది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో 1813 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో 3,39,434 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కొత్తవలస, శృంగవరపుకోట మండలాల్లో 20 చొప్పున అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

● బొబ్బిలి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 97 పంచాయతీ ఎన్నికలకు 932 పోలింగ్‌ కేంద్రాలు, ఎస్‌.కోట నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే 88 గ్రామ పంచాయతీలకు 881 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

5,983 సిబ్బంది కేటాయింపు

పోలింగ్‌ నిర్వహణకు 5,983 మంది సిబ్బందిని కేటాయించగా, వారిలో 2325 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులు (రిజర్వు సహా) ఉన్నారు. పర్యవేక్షణకు 32 జోన్లు, 72 రూట్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది, సామగ్రి తరలింపునకు 95 బస్సులు, 110 టాటా ఏస్‌/జీపు/ మ్యాక్సీ క్యాబ్‌లు వినియోగించనున్నారు. జోనల్‌ అధికారులకు 32 వాహనాలు, ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు 16 వాహనాలు సిద్ధం చేశారు. జిల్లాలో 3,073 బ్యాలెట్‌ బాక్సులు పనిచేసే స్థితిలో ఉండగా, తొలి విడతకు అవసరమైనవి అందులో నుంచే సమకూర్చారు.

పోటీలో 429 మంది సర్పంచ్‌ అభ్యర్థులు

36 పంచాయతీలు ఏకగ్రీవం

185 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

185 గ్రామ పంచాయతీల్లో 96 సాధారణమైనవి కాగా, 60 సున్నితమైనవి, 29 అతి సున్నితమైనవి. పోలింగ్‌ కేంద్రాల పరంగా 847 సాధారణ, 588 సున్నిత, 378 అతి సున్నిత విభాగాల్లో ఉన్నాయి. వాటిలో రామభద్రపురం, తెర్లాం, ఎల్‌.కోట, శృంగవరపుకోట మండలాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లోని 89 పంచాయతీల పరిధిలో 966 పోలింగ్‌ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలింగ్‌ కేంద్రాలు ఉన్న 1023 గదుల్లో 469 చోట్ల (290 సున్నిత, 179 అతి సున్నిత) వెబ్‌కాస్టింగ్‌ ఉంటుంది. మిగిలిన 554 సాధారణ గదుల్లో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement